గ్రామ పెద్దల సమాచారం ప్రకారం, ఈ రోజు ఉదయం, అమ్మ వారికి, దేవుడు భద్రయ్య గారి వారసులు, డప్పులు, మేళాలతో తల్లికి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దీపారాధన చేసి, నైవేద్యం పెట్టి, పూలాలంకరణ చేయుదురు. దేవుడు భద్రయ్య గారి ఇంటి నుండి పాలకావడి, చిలకలు, గాజులు, పసుపు, కుంకుమ, చీరలు తీసుకుని వచ్చుదురు.
ఈ సంబరం రోజు అమ్మ వారు చెరువు రేవు లో స్నానం చేస్తూ ఓలలాడునపుడు, గుడిసె వారు మగ్గులతో నీళ్ళు పోసెదరు. తడి బట్టలతో అమ్మ వారికి పారాయణం చేసి, బొట్టులు పెట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టి, చిలకలు (తల్లికి ప్రీతికరమయిన తీపి) ఎగురవేసి, పుట్టినింటి కి పోతు రాజు తో వచ్చును. వచ్చునపుడు, కాళ్ళు క్రింద పెట్టకుండా, చలువ బట్టలు వేసి తీసుకుని వచ్చుదురు. వచ్చునపుడు దారి నందు కోడి ని సుమారుగా ఊరి మేడ ముందు చూపెట్టి తీసుకుని వచ్చుదురు.
పుట్టినింటి వారు, కాళ్ళు కడిగి, ఒడి బియ్యం కట్టి, చీర, జాకెట్ పెట్టి, బొట్టు పెట్టి , గాజులు తొడిగి, ఇంటిల్లి పాది దణ్ణం పెట్టుకుని (తల్లి, మమ్ములను, ఊరి ప్రజలను సుఖము గా చూడుమనీ, ఆశీర్వదించమని కోరి అమ్మ వారిని పంపుదురు ) సారె, పానకము, పాలు, తల్లికి ఇష్టమయిన చిలకలు (తీపి) కావడి తో పుట్టినింటి వంశస్తులు మరియు లంకాదొడ్డి గుడిసె వారు అందరూ అమ్మ వారితో గద్దె వరకు చలువ బట్టలు మీద నడుచుకుంటూ వచ్చి, అన్నియు ఇచ్చి కూర్చుండ బెట్టి కొబ్బరికాయ కొట్టి, సాంబ్రాణి వేసి, చిలకలు ఎగురవేసి, దణ్ణం పెట్టుకుంటారు. గద్దె దగ్గరకు వచ్చునపుడు, గంగానమ్మ తల్లి కి దణ్ణం పెట్టి, పోతు రాజు కు కొబ్బరి కాయ కొట్టుదురు. మరియు గద్దె నందు ప్రవేశించు సమయము నందు, నల్ల కోడి ని చూపెట్టి, చాకలి వానితో, దిష్టి తీసి లోపలికి వచ్చుదురు. ఆ తరువాత భక్తులు అందరూ దేవతను దర్శించుకుందురు. పుట్టినింటి వారు చేయు ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.
ఆ రోజు సాయంత్రం, పోతు రాజు మరియు పంబళ వారు, చాకలి తో ముంత, ప్రమీదలు, మంచి నూనే, సాంబ్రాణి, దద్దోజనం, పరమాన్నం అన్నియును కావడి తో చాకలి తీసుకుని ఊరి బయట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి, అన్నియును తెల్లటి వస్త్రము నందు పెట్టి, జమ్మి చెట్టు చుట్టూ కట్టి, దీపారాధన పంబళ వారు చేయుదురు. కాసేపటి తరువాత, అందరూ వెళ్ళి, పంబళ వారు చెప్పే కధ విని, ప్రసాదములు తీసుకుని గుడికి వచ్చుదురు. ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.
ఆ రాత్రి, అన్నదానము నందు భోజనాలు అయిన తరువాత, 10 గం లకు, పుట్టి నింటి వారి స్థలము నుండి (ఈ రోజుల్లో ఎవరి ఇళ్ల నుండి వారి యొక్క) ఎడ్ల బండ్ల పై ప్రభ లు కట్టి (ఈ రోజుల్లో ట్రాక్టర్లు) దేదీప్యమయిన లైట్ లతో మరియు ఇష్టమయిన దేవుడి ప్రభ లతో అలంకరించ బడి, దేవుడు భద్రయ్య గారు (ఇప్పుడు పోతు రాజు కానీ దేవుడు భద్రయ్య గారి వారసులు కానీ) వచ్చి దేవుడి గారి బండి ముందు కొబ్బరి కాయ కొట్టి, అగరవత్తులు వెలిగించి, సాంబ్రాణి చల్లి, తల్లికి దణ్ణం పెట్టుకుని, పంబళ వారు నిమ్మ కాయ తీసిన తరువాత మొదటగా దేవుడు గారి బండి, బండి మీద దేవుడు భద్రయ్య గారు, తరువాత పుట్టినింటి వారి బళ్ళు, తరువాత ఊరి వారి బళ్ళ తో, ఊరేగింపు బయలు దేరును.
ఊరేగింపు నందు, డప్పుల వారితో, కోలాటం చేయు వారితో, మైక్ సెట్టింగ్స్ తో కోలాహలంగా బయలుదేరి, గద్దె దగ్గరకు వచ్చును. దేవుడు భద్రయ్య గారు ఈ రోజు చీర కట్టుకుని, గద్దె నుండి అమ్మ వారి ఫోటో ను, తీసుకుని, బయటకు వస్తూ, గద్దె నందు తెచ్చి పెట్టుకున్న కర్రలు అందరకి ఇస్తూ వచ్చి, మొదటి బండి ఎక్కిన తరువాత, గద్దె నుండి బయలుదేరి, ఊరి చుట్టూ, ప్రతి వీధి తిరుగును. లంకాదొడ్డి గ్రామము గుడిసె వారి ఇంటినుండి ప్రభ రామాలయం, గంగానమ్మ గుడి మీదుగా ఊరి అంతయు తిరిగి మామిడికోళ్ళ ప్రభ బళ్లతో కలిసి, తిరుగును. ప్రతి ఇంటి దగ్గర ఆగి, ఆ ఇంటి వారు, కొబ్బరి కాయ కొట్టి, అగరవత్తులు వెలిగించి, పసుపు, కుంకుమ, వేపాకులు కలిపిన నీళ్ళు దేవుడు బండి ముందు వార పోసి, తల్లికి దణ్ణం పెట్టుకుందురు.